అనూహ్యంగా ఆగిన చంద్రయాన్‌..సాంకేతిక సమస్యలే కారణం

 శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాబిల్లి యాత్ర ‘చంద్రయాన్‌-2’ అనూహ్యంగా ఆగిపోయింది. వాహకనౌక అయిన ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత 2-3 నిమిషాలకే చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఆపేశారు. మళ్లీ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు చెప్పారు. 
మళ్లీ ఎప్పుడు? 
అన్నీ అనుకున్నట్లు సాగి ఉంటే.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్‌ నుంచి ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3-ఎం1’ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది. ఆపై కేవలం 16.13 నిమిషాల వ్యవధిలో చంద్రయాన్‌-2ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది. తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా నిర్దిష్ట సమయం(లాంచ్‌ విండో)లోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. ప్రస్తుత లాంచ్‌ విండో(సోమవారం తెల్లవారుజాము)లో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదురైంది. మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్‌ విండోలే అందుబాటులో ఉన్నాయి. సోమవారం నాటి లాంచ్‌ విండో నిడివి 10 నిమిషాలు కావడం గమనార్హం. అంతకుముందు, తిరుమల వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో షార్‌కు వచ్చారు. షార్‌లో రూ.629 కోట్లతో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం రెండో ప్రయోగ వేదిక వద్దకెళ్లి చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని పంపనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3-ఎం1 వాహక నౌకను వీక్షించారు. అక్కడే ఇస్రో అధిపతితో కలిసి ఫొటో దిగారు. అక్కడ నుంచి మళ్లీ నక్షత్ర అతిథి భవనానికి చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *