అన్నారం గ్రావిటీ కాల్వలోకి 5 పంపుల ద్వారా పరుగులు పెడుతున్న గోదావరి జలాలు

మహదేవపూర్‌: కాళేశ్వర గంగ ఉప్పొంగుతోంది. కన్నేపల్లి పంపుహౌస్‌ ద్వారా నీటిని అధికారులు నిరంతరాయంగా ఎత్తిపోస్తున్నారు. 5 పంపుల ద్వారా అన్నారం గ్రావిటీ కాల్వలోకి గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి.  ఈ నెల 1 నుంచి దశల వారీగా కన్నేపల్లి పంపుహౌస్‌ నుంచి అధికారులు గ్రావిటీ కాల్వలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే 1,3,4,6 పంపుల ద్వారా నీటిని పంపిస్తుండగా.. ఆదివారం ఐదో పంపును ప్రారంభించారు. మొత్తం 5 పంపుల ద్వారా 10 పైపుల నుంచి ఏకధాటిగా నీటిని ఎత్తిపోస్తున్నారు. జలప్రవాహంతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ పరిసరాలు కళకళలాడుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో మరో పంపును వినియోగంలోకి తీసుకొచ్చి నీటిని ఎత్తిపోయనున్నారు. ఒక్కోపంపు నుంచి 2300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 11,500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మరోవైపు మొత్తం 85 గేట్లు మూసివేయడంతో మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి 6.508 టీఎంసీల  నీరు బ్యారేజీలో నిల్వ ఉంది. కన్నేపల్లి పంపుహౌస్‌ నుంచి వస్తున్న ప్రవాహంతో అన్నారం బ్యారేజీలోకి3.64 టీఎంసీల నీరు వచ్చి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *