అప్పుడు విజయశాంతి.. ఇప్పుడు కీర్తి సురేశ్‌

హైదరాబాద్‌: 1990లో విజయశాంతి.. 2019లో కీర్తి సురేశ్‌. అదేంటి మధ్యలో చాలా మంది తెలుగు నటీమణులు వెండితెరపై సందడి చేశారు కదా అనుకుంటున్నారా!.. నిజమే ఎంత మంది నటీమణులు సినిమాల్లో నటించినప్పటికీ కొందరినే జాతీయ అవార్డు వరిస్తుంది. 1967లో జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 41 మంది కథానాయికలు 52 సార్లు జాతీయ ఉత్తమ నటి విభాగంలో పురస్కారాలు అందుకున్నారు. వారిలో 1967లో బాలీవుడ్ చిత్రం ‘రాత్ ఔర్ దిన్’ చిత్రానికి తొలిసారిగా నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకోగా… ఆ తర్వాత షబానా ఆజ్మీ ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటిగా గౌరవాన్ని పొందారు. దక్షిణాదిన మాత్రం శారద, అర్చన, శోభన మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నారు. 1978లో ‘నిమజ్జనం’ తెలుగు చిత్రానికి శారద జాతీయ ఉత్తమ నటిగా తొలి పురస్కారాన్ని అందుకోగా… ఆ తర్వాత 10 ఏళ్లకు 1988లో వచ్చిన ‘దాసి’ చిత్రానికి కథానాయిక అర్చన జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అనంతరం మూడేళ్లకు 1990లో ‘లేడీ సూపర్ స్టార్‌’గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి ‘కర్తవ్యం’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అప్పటి నుంచి 2017 వరకు హిందీ, మళయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ చిత్రాలకే జాతీయ ఉత్తమ నటి విభాగంలో పురస్కారాలు దక్కగా… దాదాపు 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ కు పురస్కారం దక్కడం విశేషం. ఇన్నేళ్ల తర్వాత టాలీవుడ్‌కు ఈ ఖ్యాతి దక్కడం పట్ల సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగువారి అభిమాన తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘మహానటి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించింది. గత ఏడాది మేలో విడుదలైన ఈ చిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’లో ఈ సినిమా ‘ఈక్వాలిటీ ఇన్‌ సినిమా అవార్డ్‌’ గెలుపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *