ఆప‌రేష‌న్ ఆషాఢం

క‘ర్నాటకం’ ఒక్కో అంకం విలక్షణ మలుపులు తీసుకుంటోంది. ఓట్లు వేసిన ప్రజలు నేతల తీరును తప్పుపడుతుండగా, అధికార పీఠం కాపాడుకునేందుకు అధికార పక్షం, దాన్ని దక్కించుకునేందుకు విపక్షం ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటకం.. రసకందాయంలో పడింది. తుమ్మితే ఊడిపోయే..లా- నడిసంద్రంలో నావలా కుమార సర్కారు కొట్టుమిట్టాడుతోంది. మంత్రి పదవులు దక్కలేదని కొందరు- సంకీర్ణ సర్కారు కూరలో కరివేపాకులా మారిపోయామన్న బాధతో ఇంకొందరు- వెరసి శనివారం ఒక్కరోజే 13 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చీటీలు రాసిపారేశారు. సీనియరు నాయకుల పెత్తనం ఎక్కువైందని, మండలి, కార్పొరేషన్‌ పదవుల్లోనూ ఇతరుల జోక్యం అధికమైందంటూ ఆ లేఖాస్త్రాలు సంధించారు.

* ప్రభుత్వాన్ని కాపాడడం చివరి వరకు సాధ్యం కాకపోతే జనతాదళ్‌తో కలిసి ప్రతిపక్షంలో కూర్చునేందుకు మానసికంగా సిద్ధం కావాలని పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలిసింది. కుమారస్వామి బదులుగా తమ పార్టీ నేత ఒకరికి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కోరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని, ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇస్తామని, కాంగ్రెస్‌ అసంతృప్త నేతలను బుజ్జగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

* మరో వైపు- జనతాదళ్‌ నేతలు కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి అప్పగిస్తే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కుమారస్వామి, దళపతి దేవేగౌడ ఎంత మాత్రం అంగీకరిస్తారన్నదే ఇప్పటి ప్రశ్న. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని దేవేగౌడ తన ఆప్తుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. సిద్ధరామయ్య పేరును మాత్రం పరిశీలించడానికి గౌడ అయిష్టంగా ఉన్నారనేదీ వెలుగులోకి వచ్చింది. ‘మా రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా బాధ ఎవరికి అర్థం అవుతుంది? మంత్రి పదవి ఇస్తామన్నా వెనక్కు వెళ్లం. పార్టీ నాయకులతో చర్చించినా ప్రయోజనం లేదు’ అని అసమ్మతి కూటమి నాయకుడు మునిరత్న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెడితే ఉప ముఖ్యమంత్రి పదవిని గౌడ పెద్ద కుమారుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణకు అందించే అవకాశాలపైనా అంచనాలు ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్ష స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన విశ్వనాథ్‌ మినహా, మిగిలిన ఇద్దరు నేతలను బుజ్జగించే పనులను జనతాదళ్‌ ప్రారంభించింది.

* మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు అంటూ ప్రకటించిన ప్రతిసారీ అసమ్మతి సెగలు రేగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్‌తో పొత్తే కొంప ముంచిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దళ్‌ దిగ్గజం దేవేగౌడ, ఆయన మనవడు నిఖిల్‌ కుమారస్వామి ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత వారిలోనూ ఆలోచనలు మారాయి. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు లోక్‌సభకు పోటీ చేయడం వంశ పారంపర్యాన్ని కొనసాగించడమేనని కాంగ్రెస్‌ నేతలు కొందరు వ్యాఖ్యానించారు. ఇంత జరిగాకా.. నిఖిల్‌కు యువ జనతాదళ్‌ అధ్యక్షుని కిరీటం పెట్టారు.

● కాంగ్రెస్‌లో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీ తీరును తప్పు పడుతూ ప్రకటనలు చేసిన సీనియర్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జార్ఖిహొళిని విస్మరించి- నాపై సస్పెన్షన్‌ వేటు వేయడం ఏంటని మాజీ మంత్రి రోషన్‌ బేగ్‌ తన స్వరాన్ని పెంచారు. మరోవైపు.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నా మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తున్నారని సీనియర్‌ నేత రామలింగారెడ్డి నిప్పులు చెరిగారు. మంత్రిగా, సమన్వయ సమితి సభలో తనకు అవకాశం ఇస్తామన్న హామీని దళ్‌ పెద్దలు తుంగలో తొక్కారన్నది విశ్వనాథ్‌ ఆక్రోశం.

ఎవరికో పీచుమిఠాయి : రాజీనామాల ఘట్టం నేపథ్యంలో నేతల జాడే కానరాని

విధానసౌధ ముంగిట పర్యాటకుల కోసం పీచుమిఠాయి విక్రయించడానికి చిరువ్యాపారి సందడి

* వ్యూహకర్తగా పేరున్న దళపతి దేవేగౌడ తొలుత మౌనాన్ని ఆశ్రయించారు. సంక్షోభంపై బెంగళూరులో ఆదివారం ప్రశ్నించిన విలేకరులపై రుసురుసలాడారు. ‘కుమార’ ముఖ్యమంత్రిగా కొనసాగడం మీకు ఇష్టం లేనట్లుంది’ అంటూ కయ్యిమన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీ వీడకుండా రిసార్టులకు తరలించే ఆలోచనలో దళ్‌ నేతలు ఉన్నారు. ‘రివర్స్‌ ఆపరేషన్‌’ చేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప ఎద్దేవా చేశారు. పతనమవుతున్న ప్రభుత్వంలో చేరేందుకు భాజపా నాయకులు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. ‘ఆపరేషన్‌ కమల’ ప్రకటనలూ అర్థరహితమని అన్నారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాల్సిన అసవరం భాజపాకు లేదన్నారు.

* ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ పాత్ర కీలకం కానుంది. ఆయన వ్యక్తిగత పనుల కోసం తమిళనాడులో పర్యటిస్తుండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *