ఇంటర్‌ పరీక్షల ఫలితాలలో అవకతవకలపై ఆందోళనలు జరిగినా మారని ఇంటర్‌ బోర్డు తీరు

చింతపల్లి: ఇంటర్‌ పరీక్షల ఫలితాలలో అవకతవకలపై ఆందోళనలు జరిగినా, విమర్శలు వచ్చినా  ఇంటర్‌బోర్డు పనితీరులో మాత్రం మార్పు రాలేదు. దీనికి నిదర్శనం ఆదివారం విడుదలైన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలే. నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన ఎండీ సల్మాన్‌ ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ చదివాడు. మార్చిలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల సందర్భంగా సల్మాన్‌ డిబారయ్యాడు. అప్పటికే అతను ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించి అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత సాధించాడు. అందులో గణితశాస్త్రం పేపర్‌ 1(బి)లో 39 మార్కులు వచ్చాయి. ఈ క్రమంలో సల్మాన్‌ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరానికి సంబంధించి అన్ని సబ్జెక్టులను రాశాడు. ఆదివారం విడుదలైన ద్వితీయ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ మొదటి సంవత్సరం గణితశాస్త్రం పేపర్‌ 1(బి)లో కేవలం ఒక మార్కు సాధించినట్లు జాబితాలో రావడంతో నివ్వెరపోయాడు. ఇంటర్‌ బోర్డు తప్పిదంతో తాను ఉత్తీర్ణుడిని కాలేకపోయానని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *