‘ఇస్మార్ట్‌’ క్రికెట్‌ బాల్‌

సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్‌లో టెక్నాలజీ వినియోగం ఎంతో పెరిగింది. ఒక్క క్షణంలోనే ఎన్నో అంశాలు పరిశీలించాల్సిన అంపైర్ల పాలిట వరంగా మారింది. ఒకప్పుడు ప్రత్యక్ష ప్రసారాలే ఉండేవి కావు. ఆ తర్వాత నలుపు, తెలుపు రంగుల్లో ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. అభిమానుల వీక్షణను కలర్‌టీవీ క్రమంగా విప్లవాత్మకంగా మార్చేసింది. హైడెఫినేషన్‌ రాకతో మనోహరంగా ఆటను ఆస్వాదిస్తున్నారు. రిప్లే విధానంతో ఆటగాడు ఔటో నాటౌటో తేల్చడం అంపైర్లకు కాస్త సులభతరమైంది. అక్కడి నుంచి ఎల్బీ.. డీఆర్‌ఎస్‌.. ఇలా టెక్నాలజీ పయనం కొనసాగింది. తాజాగా ‘స్మార్ట్‌ బంతి’ అదేనండీ ‘ఇస్మార్ట్‌ బంతి’ రాబోతోంది!

కుకా‘బుర్ర’ ఆలోచనఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ నాణ్యతకు మారు పేరైన క్రికెట్‌ బంతుల్ని తయారు చేస్తుంది. ఆసీస్‌, న్యూజిలాండ్‌లో వీటినే ఉపయోగిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు సాయపడాలని కూకాబుర్ర నడుం బిగించింది. స్మార్ట్‌ బంతుల్ని తయారు చేస్తోంది. వాటిలో మైక్రోచిప్‌లను అమర్చింది. వచ్చే బిగ్‌బాష్‌ సీజన్‌లో ‘ఇస్మార్ట్‌ బంతి’ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు సమాచారం.
కచ్చితత్వం.. సమగ్రతఇప్పటికే స్మార్ట్‌ బంతిని రకరకాలుగా పరీక్షించింది. చివరిగా బిగ్‌బాష్‌లో ప్రయోగిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోనుంది. బంతి వేగం, నియంత్రణ, కోణం, ఏ పాయింట్‌లో రిలీజ్‌ చేశారు, బంతి పిచ్‌ అయ్యే ముందు బౌన్స్‌ ఎంత, పిచ్‌ అయిన తర్వాత బౌన్స్‌ ఎంత వంటి గణాంకాలను సరికొత్త స్మార్ట్‌ బంతి సమగ్రంగా, అత్యంత కచ్చితత్వంతో అందించనుంది! ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్‌ అవుతోంది?గాలిని బట్టి ఎంత వేగంతో బంతిని విసరాలి? ఎక్కడ విసిరితే ఎలా టర్న్‌ అవుతుంది?వంటి వివరాల్ని ఇవ్వనుంది.
అంపైర్లకు సౌలభ్యంనిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌)లో స్మార్ట్‌ బంతి విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఉదాహరణకు ఎల్బీడబ్ల్యూ సంగతే తీసుకుందాం. ప్రపంచకప్‌లో దీనివల్ల అంపైర్లు, ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తాయి. పేసర్లు వేసిన బంతి మిడ్‌ వికెట్‌ మధ్యలో పిచ్‌ అయినా గమనం మారి ఒక్కోసారి పక్కకు వెళ్తున్నట్టు చూపిస్తోంది. దీంతో ఆటగాళ్లు విసుగు చెందుతున్నారు. ఒక్కోసారి బెయిల్స్‌ పైన తాకుతున్నట్టు కనిపిస్తుంది. బ్యాటు, ప్యాడ్‌ మధ్యన బంతి వెళ్లే దూరం విషయంలో అస్పష్టత నెలకొంటోంది. హాట్‌స్పాట్‌ సంగతీ అంతే. హోరాహోరీగా సాగే పోరులో, ఐసీసీ నిర్వహించే బహుళ దేశాల టోర్నీల్లో కీలక సమయాల్లో స్మార్ట్‌ బంతి సమగ్రమైన వివరాలు అందిచగలదని అంచనా వేస్తున్నారు. దీంతో అంపైర్లు, ఆటగాళ్ల మధ్య అభిప్రాయబేధాలు రాకుండా ఉంటాయి.
బిగ్‌బాష్‌తో మొదలుఈ స్మార్ట్‌ బంతి తయారీ కోసం కూకాబుర్రతో స్పోర్ట్‌కోర్‌ అనే సంస్థ చేతులు కలిపింది. ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మైకేల్‌ కస్ప్రోవిచ్‌ దానికి ఛైర్మన్‌. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్‌ లీగుల్లో ఈ బంతిని పరీక్షించాలని ఆ సంస్థలు కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే మొదట బీబీఎల్‌లో ప్రయోగించనున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన టీ20 లీగ్‌ ‘బిగ్‌బాష్‌’ అన్న సంగతి తెలిసిందే. చూద్దాం! ఈ ‘ఇస్మార్ట్‌ బంతి’ మరి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *