ఎట్టకేలకు నాడా పరిధిలోకి బీసీసీఐ

దేశంలో ప్రతి క్రీడా సమాఖ్య నాడా  పరిధిలోకి వస్తుంది. ఈ సంస్థ ఎప్పుడైనా డోప్‌ పరీక్షల కోసం క్రీడాకారుల నుంచి నమూనాలు సేకరించవచ్చు. కానీ బీసీసీఐ మాత్రం తమది స్వయం ప్రతిపత్తిగల సమాఖ్య అంటూ కొన్నేళ్లుగా నాడాలో ఉండేందుకు తిరస్కరిస్తోంది. కానీ ఇప్పుడుపట్టువీడక తప్పలేదు. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో బోర్డు ఎట్టకేలకు నాడా పరిధిలోకి రావడానికి అంగీకరించింది. అధికారికంగా జాతీయ క్రీడా సమాఖ్యగా మారిపోయింది.

దిల్లీ

బీసీసీఐ చరిత్రలో ఓ కీలక మలుపు. ఇన్నాళ్లు ససేమిరా అంటూ వస్తున్న బీసీసీఐ పట్టువీడి.. జాతీయ డోపింగ్‌ నిరోధ సంస్థ (నాడా) పరిధిలోకి వచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఆర్థికంగా స్వతంత్రురాలే అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీసీఐ జాతీయ క్రీడా సమాఖ్య అయింది. నాడాకు లోబడి ఉండేదుకు బీసీసీఐ లిఖితపూర్వకంగా అంగీకరించిందని క్రీడల శాఖ కార్యదర్శి రాధేశ్యామ్‌ జులానియా చెప్పాడు. ‘‘ఇక దేశంలో క్రికెటర్లందరినీ పరీక్షించే అధికారం నాడాకు ఉంది’’ అని అన్నాడు. నాడా డీజీ నవీన్‌ అగర్వాల్‌తో కలిసి జులానియా శుక్రవారం… బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, బోర్డు జనరల్‌ మేనేజర్‌ (సబా కరీమ్‌)లతో సమావేశమయ్యాడు. ‘‘బీసీసీఐ మూడు అంశాలు.. డోప్‌ పరీక్షల్లో వాడే పరికరాల నాణ్యత, పాథాలజిస్ట్‌ల సమర్థత, నమూనాల సేకరణ గురించి సందేహాలు వ్యక్తం చేసింది. వాళ్లు కోరిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. కానీ వాటికి కొంత డబ్బు వసూలు చేస్తాం. కానీ అత్యుత్తమ సదుపాయాలు మాత్రం అన్ని జాతీయ సమాఖ్యలకు సమానంగా ఉంటాయి. బీసీసీఐ భిన్నం కాదు. దేశంలో చట్టాన్ని  వారు గౌరవించాల్సిందే’’ అని అన్నాడు. తాజా పరిణామం పర్యవసానం భారీగా ఉండబోతోంది. జాతీయ క్రీడా సమాఖ్య  (ఎన్‌ఎస్‌ఎఫ్‌)గా మారిన బీసీసీఐపై.. సమాచార హక్కు చట్టంలోకి రావాలనే ఒత్తిడి మరింత తీవ్రం కానుంది. మరోవైపు ఎన్నికైన సంఘం గైర్హాజరీలో ఇలాంటి కీలకం నిర్ణయం (నాడాను అంగీకరించడం) తీసుకునే హక్కు పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై జోహ్రి స్పందిస్తూ..  ‘‘బోర్డును నడిపించేదెవరైనా ఈ దేశంలో చట్టాలను గౌరవించాల్సిందే. ఎప్పటి నుంచి చట్టాన్ని అనుసరించాలో ఎంచుకునే హక్కు మనకు ఉండదు’’ అని అన్నాడు. దక్షిణాఫ్రికా-ఎ, మహిళల జట్ల పర్యటనకు అనుమతి ఇవ్వాలంటే నాడా పరిధిలోకి రావాలని    బీసీసీఐపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్న ఊహాగానాలను జోహ్రి కొట్టిపారేశాడు. ‘‘రెండు వేరు వేరు అంశాలు. పర్యటనలకు ఇంతకుముందే అనుమతి లభించింది’’  అని జోహ్రి చెప్పాడు.

ఇంతకాలం ఎందుకు  వద్దంది? 
తాను స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోని తాను జాతీయ సమాఖ్య కాదని బీసీసీఐ ఇప్పటిదాకా గట్టిగా వాదిస్తూ వచ్చింది. నాడా పరిధిలోకి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ఆచూకీ’ నిబంధనే బోర్డు నాడాను అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం. ఈ నిబంధన ప్రకారం.. పోటీలు లేనప్పుడు కూడా ఆటగాడు ఓ మూడు నిర్ణీత తేదీల్లో డోప్‌ పరీక్షలకు అందుబాటులో ఉండాలి. ఆ మూడు తేదీల్లో ఎక్కడ ఉంటాడో నాడాకు సమాచారమివ్వాలి. ఈ మేరకు అతడు ఓ దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. ఆ మూడు రోజుల్లో అతడి నుంచి నమూనాలు సేకరించే అధికారం నాడాకు ఉంటుంది. ఆ నిర్ణీత తేదీల్లో అతడు పరీక్షలకు అందుబాటులో లేకుండా పోతే ప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం నిషేధానికి గురికావాల్సివుంటుంది. ఈ కారణంతోనే విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ గతంలో ఏడాది నిషేధానికి గురయ్యాడు. తమ ఏకాంతానికి భంగం  కలిగించేలా ఉందంటూ స్టార్‌ ఆటగాళ్లంతా కూడా ఈ ‘ఆచూకీ’ నిబంధనను తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లు ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి.

ఇప్పుడెలా ఒప్పుకుంది? 
పృథ్వీ షా డోపింగ్‌ కేసులో సరిగా వ్యవహరించకపోవడం, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సీఓఏ తమ అధికార పరిధిని దాటడం వల్లే.. బీసీసీఐ బలవంతంగా నాడా పరిధిలోకి వెళ్లాల్సివచ్చిందని బీసీసీఐ అధికారులు అంటున్నారు. ఆర్థికంగా ఇప్పటికే స్వతంత్రురాలే అయినా.. నాడాకు లోబడడం వల్ల బీసీసీఐ స్వయంప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదముందని చెబుతున్నారు. ‘‘సీఈఓ లేదా సీఓఏకు అలాంటి విధానపరమైన నిర్ణయం (నాడాలోకి వెళ్లడానికి ఒప్పుకోవడం) తీసుకునే అధికారం లేదు’’ అని ఓ అధికారి అన్నాడు. పృథ్వీ డోపింగ్‌ కేసులో సీఓఏ సరిగా వ్యవహరించకపోవడంతో క్రీడా మంత్రిత్వశాఖ, నాడాలకు అవకామిచ్చినట్లయిందని ఓ మాజీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు అభిప్రాయపడ్డాడు. డోపింగ్‌లో పట్టుబడ్డ పృథ్వీని సీఓఏ తేలికైన శిక్షతో వదిలి పెట్టిందన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.      ‘‘నాడాను దూరం పెట్టాలంటే బోర్డు డోపింగ్‌ నిరోధ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కానీ ఏం జరిగింది? డోప్‌ పరీక్షలో విఫలమైనా పృథ్వీషాకు ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతిచ్చారు. ఎన్‌సీఏ సౌకర్యాలను కూడా అతడు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు బోర్డు నాడా పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో పృథ్వీ కేసును వాడా తిరగదోడే అవకాశముంది’’ అని ఆ మాజీ అధికారి అన్నాడు. క్రీడా మంత్రిత్వశాఖ ఒత్తిడికి సీఓఏ తలొగ్గాల్సింది కాదని మరో మాజీ అధికారి అభిప్రాయపడ్డాడు. ‘‘విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం సీఓఏ పని కాదు. ఎన్నికల తర్వాత కొత్త పాలకవర్గం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని అన్నాడు. చాలా మంది బీసీసీఐ అధికారులు బోర్డు స్వయంప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *