కశ్మీర్‌ ప్రజల గళాన్ని వినాల్సిందే: మన్మోహన్‌

దిల్లీ: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు దేశ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతీయత అనే భావం కశ్మీర్ ప్రజల్లో బలంగా ప్రబలాలంటే వారి గళాన్ని సైతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం చాలా సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. ఈ తరుణంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీలో సోమవారం జరిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న మన్మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా సైతం కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 

ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని మన్మోహన్‌ గుర్తుచేసుకున్నారు. ఆయన్ని విజ్ఞానగనిగా అభివర్ణించారు. పదేళ్లు తన మంత్రివర్గంలో వివిధ శాఖల మంత్రిగా ఆయన పని చేశారని, క్లిష్ట సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఆయన మృతితో భారత రాజకీయ రంగం ఓ ఉత్తమ పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. నాలుగు ప్రభుత్వాల్లో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించినా ఎటువంటి మచ్చ లేకుండా గడిపారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏచూరి, రాజా సైతం జైపాల్‌ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

నేడే రాజ్యసభకు నామినేషన్‌..

రాజ్యసభ సభ్యుడు మదన్‌ లాల్‌ సైనీ మృతితో ఖాళీ అయిన రాజస్థాన్‌ రాజ్యసభ స్థానం నుంచి మన్మోహన్‌ బరిలోకి దిగనున్న విషయం తెలిసిదే. ఈ మేరకు ఆయన నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అసోం నుంచి ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్‌ను ఈసారి అక్కడ తగిన బలం లేకపోవడంతో రాజస్థాన్‌ నుంచి పెద్దల సభకి పంపాలని పార్టీ నిర్ణయించింది. రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కి మెజార్టీ ఉన్న విషయం తెలిసిందే. దీంతో మన్మోహన్‌ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *