కోహ్లీ మరో రికార్డు

ట్రినిడాడ్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. అది కూడా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును అధిగమించడమే విశేషం. విండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ(120), శ్రేయస్‌ అయ్యర్‌(71) చెలరేగడంతో పాటు భువనేశ్వర్‌ (31/4) విజృంభించాడు. మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో భారత్‌ 59 పరుగులతో విజయం సాధించింది. 11 ఇన్నింగ్స్‌ల తర్వాత కెప్టెన్‌ శతకం సాధించడంతో మైదానంలో ఎగిరి గంతేశాడు. 

మరోవైపు ఈ ఒక్క శతకంతో కోహ్లీ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచంలోని మూడు వన్డే జట్లపై ఎనిమిది అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఇదివరకు ఆసీస్‌, శ్రీలంక జట్లపై ఎనిమిదేసి శతకాలు బాదిన అతడు తాజాగా విండీస్‌పై ఈ ఘనత సాధించాడు. అతడికన్నా ముందు మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ ఆసీస్‌పై తొమ్మిది, శ్రీలంకపై ఎనిమిది శతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలో సచిన్‌ రెండు జట్లపై బాధగా కోహ్లీ మూడు జట్లపై ఎనిమిది శతకాలు సాధించి భారీ రికార్డు నెలకొల్పాడు.

ఇదే శతకంతో ఇతర రికార్డులు:

* విండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ (‌2032) నిలిచాడు. అంతకుముందు 1993లో పాక్‌ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌ (1930) పేరిట ఈ రికార్డు ఉండేది.

* వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు. సౌరభ్‌ గంగూలీ (11,363)ని అధిగమించాడు కోహ్లీ (11,406). సచిన్‌ (18,426) పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

* కరేబియన్‌ దీవుల్లో జరిగిన వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ(120) సాధించాడు. అతడికన్నా ముందు 2003లో బ్రయాన్‌లారా(116) పరుగులు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *