క్రికెట్‌ బోర్డుపై నబీ సంచలన వ్యాఖ్యలు

చాట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడేసిన అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ నబీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ ఘోర ఓటమి పాలు కావడానికి తమ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ ధ్వజమెత్తాడు. ప్రధానంగా వరల్డ్‌కప్‌కు కొన్ని రోజుల ముందు కెప్టెన్‌గా గుల్బదిన్‌ నైబ్‌ను ఎంపిక చేయడమే అతి పెద్ద తప్పంటూ బోర్డు చర్యను విమర్శించాడు. తాము ఒక జట్టుగా విఫలం కావడానికి పాత కెప్టెన్‌ను మార్చి కొత్తగా నైబ్‌ నియమించడమే కారణమన్నాడు. ‘వరల్డ్‌కప్‌కు ముందు కెప్టెన్సీ మార్పు జట్టుకు తీవ్ర నష్టం చేసింది. మీరు ఎంపిక చేసిన కెప్టెన్‌కు ఎప్పుడూ ఆ బాధ్యతల్ని నిర్వర్తించిన అనుభవం లేదు.మరి అటువంటప్పుడు వరల్డ్‌కప్‌ వంటి మెగా ఈవెంట్‌కు అతన్నే ఎందుకు ఎంపిక చేశారు. మేము భారత్‌, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌ జట్లపై చాలా మెరుగైన ప్రదర్శన ఇచ్చాం. అయినా వాటిని కోల్పోయాం.

మొత్తం ఆ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో కూడా గెలవలేకపోయాం. ఇది సమిష్టి పరాజయం. కాకపోతే కెప్టెన్సీ ఉన్నపళంగా మార్చడంతో అది సెట్‌ కాలేదు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ రషీద్‌ ఖానే సరైన కెప్టెన్‌. జట్టును ముందుండి నడిపించే లక్షణాలు రషీద్‌లో పుష్కలం. అతన్ని నాతో పాటు మాజీ కెప్టెన్‌ అస్గార్‌ కూడా సమర్ధిస్తున్నాడు. యువకులతో కూడిన అఫ్గాన్‌ జట్టుకు రషీద్‌ ఖాన్‌ అవసరం ఎంతో ఉంది. కెప్టెన్‌గా రషీద్‌ ఖాన్‌ను అన్ని ఫార్మాట్లకు కొనసాగిస్తే జట్టు అద్భుతమైన విజయాలు బాట పడుతుంది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ ఒకడు’ అని నబీ పేర్కొన్నాడు. ఇటీవల తన టెస్టు కెరీర్‌కు నబీ రిటైర్మెంట్‌ ప‍్రకటించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌తో నబీ టెస్టు కెరీర్‌ ముగిసింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 224 పరుగుల తేడాతో గెలవడంతో నబీకి ఘనమైన టెస్టు వీడ్కోలు పలికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *