గుంటూరు జిల్లాలో తలనరికి దారుణ హత్య

బొల్లాపల్లి: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఏడుకొండలు (35) అనే వ్యక్తిని నాగయ్య అనే మరోవ్యక్తి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లటూరుకు చెందిన అంకె ఏడుకొండలు పశువుల కాపరి. శుక్రవారం ఉదయం గేదెలను తోలుకొని సమీపంలో అడవికి వెళ్లాడు.శనివారం వరకు ఇంటికి చేరకపోయేసరికి బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సహాయంతో పోలీసులు అడవిలో గాలించగా ఓ ప్రదేశంలో గోనె సంచిలో ఓ మృతదేహం కనిపించింది. తల నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఏడుకొండలు భార్యతో నాగయ్య అనే వ్యక్తికి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై వీరివురి మధ్య గొడవలు ఉన్నట్లు గుర్తించారు. నాగయ్య శుక్రవారం సాయంత్రం అడవికి వెళ్లి అతనితో ఘర్షణ పడి ఏడుకొండలను గొడ్డలితో నరికి చంపి సంచిలో మూటకట్టి అక్కడే పడేసి పరారైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ మేరకు సీఐ సుబ్బారావు, ఎస్సై వెంకటరావు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *