గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకోనున్న రోహిత్‌ శర్మ

లార్డ్స్‌: ప్రపంచకప్‌లో భారత ఆటగాడు రోహిత్‌ శర్మ గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకోనున్నాడు. సెమీఫైనల్లో భారత్‌ నిష్క్రమించినా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అతడే అగ్రస్థానంలో ఉండటం విశేషం. గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకునే భారత మూడో ఆటగాడిగా  రోహిత్‌ రికార్డు సృష్టించనున్నాడు. రోహిత్‌ కంటే ముందు సచిన్‌ (1996, 2003), రాహుల్‌ ద్రావిడ్‌ (1999) ఈ ఘనత సాధించారు. ఈ ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాదిన రోహిత్‌ 81 సగటుతో 648 పరుగులు సాధించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగానూ రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌ (647) రెండో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్ షకిబ్‌ అల్‌ హసన్‌ (606) మూడో స్థానంలో ఉన్నాడు. అయితే రోహిత్‌ను న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అధిగమించే అవకాశం ఉందని భావించారంతా. కానీ ఫైనల్లో 30 పరుగులకే ఔటవ్వడంతో విలియమ్సన్‌ 576 పరుగులతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐదు, ఆరు స్థానాల్లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జో రూట్‌ (556), బెయిర్‌స్టో (532) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *