జాతీయ అవార్డుల్లో మెరిసిన మరాఠీ చిత్రం

దిల్లీ: కరవు ప్రాంతంలో నీటి సంరక్షణపై అవగాహన కలిగిస్తూ ఓ సామాజిక కార్యకర్త చేసిన పోరాటమే ఆ సినిమాకు ప్రేరణ. మహారాష్ట్రలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యల నేపథ్యంలో తీసిన మరాఠి చిత్రం ‘పానీ’. పర్యావరణ పరిరక్షణ విభాగంలో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్‌ నటి, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను పొందింది. నిజ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో నీటి ఎద్దడి సమస్యలను చూపారు. మహారాష్ట్రలోని కరవు ప్రాంతం నగ్దార్‌వాడిలో నివసించే ఓ వ్యక్తి కథే ఈ సినిమా. నీటి సంరక్షణ పద్ధతులను గ్రామంలో వ్యాప్తి చేసి.. కరవుపై గ్రామస్థులతో కలిసి ఆ వ్యక్తి చేసిన పోరాటాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపారు. అంతేకాదు, ఇందులో ఆకట్టుకునే ప్రేమ కథ కూడా ఉంది.  సందేశాత్మకంగా సాగిన ఈ చిత్రం జాతీయ అవార్డును దక్కించుకొని మరోసారి వార్తల్లో నిలిచింది.

ప్రియాంక సొంత నిర్మాణ సంస్థ ‘పర్పుల్‌పెబెల్‌ పిక్చర్స్‌’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియాంక నిర్మించిన నాలుగో మరాఠీ చిత్రం ఇది. అధినాథ్‌ ఎం. కొఠారే నటుడిగాను, దర్శకుడిగానూ ఈ సినిమా ద్వారా తన ప్రతిభను చాటుకున్నాడు. ఇటీవల న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *