డెంగీ కారణం ఆ దోమేనట..

టైగర్‌ దోమ.. పగలే వేట

ఈ మాయదారి దోమ వల్లే డెంగీ

హైదరాబాద్‌ : దాని పేరు టైగర్‌ దోమ! భూతద్దం పెట్టి చూస్తే.. దాని మీద పులికి ఉన్నట్లుగా చారలు కనిపిస్తాయి. అందుకే దానికా పేరొచ్చింది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటంతో ‘అర్బన్‌ మస్కిటో’ అనీ పేరు. జనాలను కుడుతూ ప్రాణాంతకమైన డెంగీ ఫీవర్‌కు కారణమై.. మంచం పట్టేలా చేస్తోంది ఈ దోమే. ఇటీవల ఆస్పత్రుల్లో డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒక టైగర్‌ దోమ.. రోజులో కనీసం పది మందిని కాటేస్తుంది. డెంగీ వచ్చిన రోగిని కుట్టి.. ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే అతడికి డెంగీ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఈ టైగర్‌ దోమల సంఖ్య బాగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టైగర్‌ దోమ రాత్రివేళల్లో ఎట్టిపరిస్థితుల్లో కుట్టదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పగటిపూటే ఈ దోమ కుడుతుందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే డెంగీ వ్యాఽధికి గురయ్యే ప్రమాదం నుంచి బయటపడొచ్చునని చెబుతున్నారు. తేమ ఉన్న ప్రదేశాలే స్థావరంనీళ్లున్న చోటే టైగర్‌ దోమలు స్థావరాలు ఏర్పరుచుకుంటాయి. వంటగది సింకుల్లో, మరుగుదొడ్లు, స్నానపు గదుల్లో, ఎయిర్‌ కూలర్‌ నీళ్లలో, ఫ్లవర్‌ వాజ్‌ల్లో, ఆక్వేరియంల వద్ద, నిల్వ చేసిన ఆహార వ్యర్థాల్లో తేమ ఉన్న ఇతర చోట్ల ఈ దోమలు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంటి పరిసరాల్లో మరుగునీరు నిల్వ ఉన్నా ప్రమాదమేనంటున్నారు. అందుకే.. కూలర్‌, ఫ్లవర్‌ వాజ్‌ల్లో నీళ్లను మారుస్తూ ఉండాలని, ప్లాస్టిక్‌ బకెట్లు, ఇతర వాటిల్లో నీళ్లు నిల్వ చేయొద్దని, ఆహార వ్యర్థాలను ఎప్పటికప్పుడు దూరంగా పడేయాలని సూచిస్తున్నారు. డెంగీలో నాలుగు రకాల వైరస్‌ ఉంటుంది. ఇందులో టైప్‌-2, టైప్‌-4 ఆందోళనకరం అని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల నుంచి రక్తం కారడం, మూత్రంలో రక్తం పడటం, శరీరంపై దద్దుర్లు రావడం వంటివి డెంగీ లక్షణాలని సన్‌షైన్‌ ఆస్పత్రి వైద్యుడు ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 1.5లక్షల నుంచి 4లక్షల వరకు ఉండాలని.. వీటి సంఖ్య తగ్గితే డెంగీగా అనుమానించాలన్నారు. పగటి పూట దోమలు కుట్టవనే భావనతో ఉండొద్దని యశోద ఆస్పత్రి వైద్యుడు హరికిషన్‌ బూరుగు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *