తుగ్లక్ పాలన అంటే ఎంటో జగన్ చూపించారు: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారని భావించిన రాష్ట్ర ప్రజలు జగన్‌కు అధికారం ఇస్తే.. ప్రజల నమ్మకాన్ని వొమ్ముచేశారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ 100 రోజుల పాలనపై స్పందించిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తుగ్లక్ పాలన అంటే ఎంటో 100 రోజుల్లో జగన్ చూపించారన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పధకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 100 రోజుల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, పెన్షన్ రూ. 250 రూపాయలు పెంపు తప్పా ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం, విద్యుత్ ఒప్పందాల విషయంలో ప్రభుత్వ తీరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగాయని, 100 రోజుల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్క అవినీతిని ప్రభుత్వం బయటపెట్టలేకపోయిందని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లగా జగన్ నియమించారని, ప్రజల సొమ్ము వైసీపీ కార్యకర్తలకు కట్టబెట్టే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. జగన్ ఉద్దానం ప్రాంతానికి కొత్తగా ఇచ్చిందేమీ లేదన్నారు. 2017లో ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, ఉద్దానం మంచినీరు ప్రాజెక్టుకు తాము పిలిచిన టెండర్లు రద్దు చేసి కొత్త జీఓ ఇచ్చారని విమర్శించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. అయితే ఎన్నికల కోడ్ రావటంతో అప్పట్లో పనులు ప్రారంభించలేకపోయామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ హాయాంలో చేసిన పనులకు సీఎం జగన్ రిబ్బన్ కట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిని మార్చే కుట్ర చేస్తున్నారన్నాని ఆరోపించారు. జగన్ పాదయాత్రలో చేసిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. సీపీఎస్ విధానం, 45 ఏళ్లకు పెన్షన్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు పెన్షన్ ఏమయ్యిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారని, పాదయాత్రలో సన్నబియ్యం హామీ 100 రోజుల పాలన తర్వాత నాణ్యమైన బియ్యం అయ్యాయని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యంతో వండిన అన్నం జగన్.. ఆయన మంత్రులు తింటారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ రాష్ట్రానికి కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదని, చంద్రబాబు పధకాలు అమలు చేస్తే చాలన్నారు. చంద్రబాబు వృధా ఖర్చులు చేస్తున్నారని ఆరోపించారని, 100 రోజుల పాలనలో జగన్ చేసిన ఖర్చులు చూస్తే అర్ధమౌతుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *