నేను ఆత్మహత్య చేసుకునేలా చేయొద్దు – నేహా కక్కర్‌

ముంబయి: ‘నేను ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించొద్దు. దయచేసి ఇలాంటి వదంతులు సృష్టించకండి’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ప్రముఖ గాయని నేహా కక్కర్‌. ‘ఇండియన్‌ ఐడల్‌’ కార్యక్రమంలో పాల్గొన్న విభోర్‌ పరాషర్‌ అనే కంటెస్టెంట్‌తో నేహా కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, వీరిద్దరూ కలిసి కచేరీ కార్యక్రమాలకు కలిసే వెళుతున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై నేహా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించొద్దని నెటిజన్లను వేడుకున్నారు.

‘ఈ పోస్ట్‌ రాస్తున్నప్పుడు నేను మానసికంగా, శారీరకంగా కుంగిపోయి ఉన్నాను. కానీ, నేను మాట్లాడి తీరాల్సిందే. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నవారు నేను ఒకరి కుమార్తెనని, సోదరినని గ్రహించరు. ఇంతకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నా పనితనంతో కుటుంబాన్ని గర్వపడేలా చేశాను. అలాంటప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థంకావడంలేదు. నేను ఓ సెలబ్రిటీని అయినప్పటికీ ముందు మనిషిగా పుట్టాను. వేరొకరితో నాకు సంబంధాలున్నాయంటూ తప్పుడు వార్తలు సృష్టించి నేను మరింత కుంగిపోయేలా చేయకండి. మీ సోదరి గురించి, కూతురి గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారా? నేను ఆత్మహత్య చేసుకునేలా చేయకండి. దయచేసి ఇవన్నీ ఆపండి. నన్ను అభిమానించేవారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నేను త్వరలో కోలుకుంటాను. ప్రస్తుతం నా టైం బాగాలేదు. కానీ, ఎప్పుడూ ఇలాగే ఉండదు’ అని పేర్కొన్నారు నేహా. 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *