పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానికులకే

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు; మొత్తంమీద మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేసే నాలుగు వేర్వేరు బిల్లులను ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ ఈ బిల్లులను సభ ముందుంచారు. అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సొసైటీలు, బోర్డులు, కమిటీల్లో ప్రభుత్వం నియమించే ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల పదవులకు ఇది వర్తిసుంది. ఆయా కార్పొరేషన్‌, ఏజెన్సీ, సొసైటీ, లేదా కమిటీని ఒక యూనిట్‌గా చేసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తారు.

* బీసీలు, మైనారిటీలకు 29, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం చొప్పున రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
* హిందూ దేవాదాయ ధార్మిక చట్టం-1987, వక్ఫ్‌బోర్డు చట్టం-1995 ప్రకారం భర్తీ చేసే నామినేషన్‌ పోస్టులకు ఈ రిజర్వేషన్లు వర్తించబోవు.
* నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, పాలకవర్గాలు, బోర్డులు, సొసైటీల పదవుల్లో 50 శాతాన్ని తప్పనిసరిగా మహిళలకు కేటాయించేందుకు చట్టం వీలు కల్పిస్తుంది.
* నామినేషన్‌ పనుల్లోనూ ఇవే రిజర్వేషన్లు ప్రభుత్వం నామినేషన్‌పై చేపట్టే అన్ని పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకో బిల్లును ఉద్దేశించారు.
* బీసీలు, మైనారిటీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% వర్తిస్తుంది.
* మహిళలకూ ఈ పనుల్లో 50% రిజర్వేషను వర్తింపజేసే మరో బిల్లును ప్రవేశపెట్టారు.
* ఇంజినీరింగు పనులు, ప్రభుత్వ పనుల్లో చేపట్టే నామినేషన్‌ పనుల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
* జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అర్హులు లేకపోతే శిక్షణనిచ్చి తీసుకోవాలి
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే బిల్లు ప్రకారం… స్థానికంగా అర్హులైన అభ్యర్ధులు అందుబాటులో లేకపోతే మూడేళ్ల లోపు వారికి అవసరమైన శిక్షణ ఇప్పించి తీసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటు కోసం అధిక శాతం వ్యవసాయ భూముల్ని సేకరించాల్సి వస్తోంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పరిశ్రమల ఏర్పాటు సమయంలో వాటి యాజమాన్యాలు హామీ ఇస్తున్నా సరిగా అమలు కావడం లేదు. కొంతమందికి ఉద్యోగాలిచ్చినా అవి తోటమాలులు, భవనాల నిర్వహణ తదితర తక్కువ వేతనాలుండే పనులే అవుతున్నాయి. ఇవన్నీ స్థానికుల్లో అసంతృప్తిని రేకెత్తించడంతోపాటు పరిశ్రమల యాజమాన్యాలపై అవిశ్వాసానికి దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులకు కనీసం 75 శాతం ఉద్యోగాలు కల్పించే అంశానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది.

చర్యలు… నివేదికలు
ఇప్పటికే ఏర్పాటైన అన్ని పరిశ్రమలు/కర్మాగారాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే సంయుక్త ప్రాజెక్టులతోపాటు ఇకపై రాబోయే వాటికీ ఈ చట్టం వర్తిస్తుంది.
* ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలైతే.. చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్ల లోపు 75 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే చర్యలు తీసుకోవాలి.
* స్థానికుల్లో అర్హులైన వారు లేకపోతే సంబంధిత పరిశ్రమలు.. చట్ట నియమావళికి అనుగుణంగా మినహాయింపులు కోరుతూ దరఖాస్తు చేయాలి. అనంతరం ప్రభుత్వం దీన్ని పరిశీలించి రెండు వారాల్లోగా ఉత్తర్వులు ఇవ్వాలి.
* ఉద్యోగాలు కల్పించే వారు త్రైమాసిక నివేదికలను నోడల్‌ ఏజెన్సీకి అందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *