ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతి

చెన్నై: అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.

మూడో పెళ్లి కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో రాజగోపాల్‌కు సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో జులై 7న లొంగిపోవాల్సి ఉండగా.. అనారోగ్య కారణాల రీత్యా తనకు మరింత గడువు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాడు. ఇందుకు కోర్టు నిరాకరించడంతో ఈ నెల 9న కోర్టులో లొంగిపోయారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న రాజగోపాల్‌.. ఆక్సిజన్‌ మాస్క్‌తో అంబులెన్స్‌లో వచ్చి లొంగిపోయారు. దీంతో ఆయనను పుళల్‌ జైలుకు తరలించారు. అయితే జులై 13న రాజగోపాల్‌కు గుండెపోటు రావడంతో అతడిని హుటాహుటిన స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో కోర్టు అనుమతితో నిన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన కన్నుమూశాడు. 

శరవణ భవన్‌ పేరుతో దేశ విదేశాల్లో ఎన్నో రెస్టరెంట్లు ప్రారంభించి పేరు గడించిన రాజగోపాల్‌ ఓ హత్య కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి కుమార్తెను మూడో భార్యగా చేసుకుంటే ఇంకా బాగా కలిసొస్తుందని ఓ జ్యోతిష్కుడు చెబితే… రాజగోపాల్‌ నమ్మాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ, అప్పటికే పెళ్లయినందున ఆమె అంగీకరించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా… 2001లో ఆమె భర్తను చంపించాడు. దీంతో రాజగోపాల్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు తొలుత అతడికి 10ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మారుస్తూ 2009లో తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం కూడా మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *