ఫరూక్ విడుదలకు సుప్రీంకోర్టులో వైగో పిటిషన్

న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను విడిచిపెట్టాలని కోరుతూ ఎండీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ వైగో బుధవారంనాడు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. చెన్నైలో సెప్టెంబర్ 15న జరుగనున్న తమిళనాడు మాజీ సీఎం దివంగత సీఎన్ అన్నాదురై జయంతి కార్యక్రమంలో అబ్దుల్లా పాల్గొనాల్సి ఉందని, జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధిస్తూ కొంతమంది రాజకీయ నాయకులను నిర్బంధంలోకి తీసుకుందని, దీంతో ఆగస్టు 5 నుంచి అబ్దుల్లా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని హెబియస్ కార్పస్ పిటిషన్‌లో వైగో పేర్కొన్నారు. డాక్టర్ అబ్దుల్లాను సుప్రీంకోర్టు ముందు హాజరు పరిచేలా భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని, ఈనెల 15న చెన్నైలో జరిగే కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వీలుగా ఆయనకు స్వేచ్ఛ ప్రసాదించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని వైగో కోరారు. డాక్టర్ అబ్దుల్లాను చెన్నై వచ్చేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాసినప్పటికీ ఇంతవరకూ తన లేఖకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కూడా ఆ పిటిషన్‌లో ఆయన ఆరోపించారు. జీవించే హ్కకు, వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతా హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్య దేశంలో హరించడం పూర్తిగా చట్టవ్యతిరేకమని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ నడిపిస్తూ, యావత్ కశ్మీర్‌ను గత నెల రోజులుగా దిగ్బంధంలో ఉంచారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వైగో తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *