బడ్జెట్‌ కీలక అంశాలు ఇవే..?

జులై ఐదో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం ముఖ్యంగా కొన్ని అంశాలపైనే దృష్టిపెట్టే అవకాశం ఉంది. కీలకమైన లక్ష్యాలైన ద్రవ్యలోటు (3.4శాతం), కరెంటు ఖాతాలోటు (2.5 శాతం), పన్నుల వసూళ్లు, ఆదాయపన్ను రేట్లు, పన్నుశ్లాబ్‌లను మధ్యంతర బడ్జెట్‌లోనే ప్రతిపాదించగా.. వాటిని ఈ సారీ కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరిగిపోతున్న ద్రవ్యలోటును కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోపక్క ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, రైతులకు భరోసా ఇచ్చే పథకాలపై భారీగా వ్యయం చేయనుంది. వీటికి తోడు విద్యుత్తు, నీటిపై ఇచ్చే రాయితీలు ఉండనే ఉన్నాయి. 

కార్పొరేట్‌ పన్నులు
పరిశ్రమలను ఆకర్షించడానికి కార్పొరేట్‌ పన్ను తగ్గింపు చాలా కీలకం. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చాలా సంస్థలు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నాయి. ఇటువంటి కంపెనీలను ఆకర్షించి మన దేశంలో వాటి కార్యాలయాలను ఏర్పాటు చేయించాలంటే కార్పరేట్‌ పన్ను తగ్గింపు చాలా కీలకం. ఇది ఆర్థిక వ్యవస్థను దూసుకెళ్లేట్లు చేయడంతోపాటు కార్పొరేట్‌ సంస్థల లాభాలను పెంచుతుంది. ప్రస్తుతం రూ.250 కోట్ల టర్నోవర్‌ దాటిన సంస్థలపై 30 శాతం పన్నులు విధిస్తున్నారు. ఇక రూ.250 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న సంస్థలపై 25శాతం పన్ను విధిస్తున్నారు. సెస్సులు ఇతర పన్నులు కలిపి ఇవి దాదాపు 35 శాతానికి చేరుతున్నాయి. దీనిని కంపెనీ సైజుతో సంబంధం లేకుండా కార్పొరేట్‌ పన్నులు 25 శాతానికి పరిమితం చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ చర్య తీసుకుంటే మూలధన వ్యయాలు 80 శాతం వరకు పెరుగుతాయని అంచనా. 
నిబంధనలు సరళతరం..
చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్‌ బాగా ఆకర్షించే అవకాశం ఉంది. ఈ కంపెనీలు భారత్‌లో తేలిగ్గా తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొనేలా నిబంధనలను సరళీకరించాలి. కార్పొరేట్‌ పన్ను చట్టాన్ని సవరించాలి. 
బ్యాంకింగ్‌ సంస్కరణలు..
ప్రభుత్వం బ్యాంకింగ్‌ సంస్కరణలను వేగవంతం చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. బ్యాంకుల విలీనం, రీక్యాపిటలైజేషన్‌, సంస్కరణల ప్రక్రియలను వేగవంతం చేయాలి. 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యంతో దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతం చాలా కీలకం. 
ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌పై నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ జూన్‌ చివరి నాటికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్‌ ముందుకు సాగనుంది. 
ఆరోగ్యరక్షణ వ్యయం పెంపు..
ప్రభుత్వ ఆరోగ్యరక్షణకు చేసే వ్యయాన్ని పెంచవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 1.2-1.5శాతం వరకు ఉండవచ్చు. వచ్చే ఐదేళ్లలో 2.5శాతం వరకు పెంచవచ్చు. 

డిజిటల్‌ లావాదేవీలు పెంచడం..
ప్రభుత్వం ఈ సారి డిజిటల్‌ లావాదేవీలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీని కోసం ఏటీఎంలో నగదు విత్‌డ్రాలను తగ్గించేందుకు పన్ను విధించనుంది. ఏడాదికి రూ.10లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పన్ను విధించవచ్చు. ఈసారే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట 
నిధుల లభ్యత లేక ఇబ్బందులు పడుతున్న ఎన్‌బీఎఫ్‌సీలను ప్రభుత్వం ఆదుకోవాలి. చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎన్‌బీఎఫ్‌సీలు ప్రధాన రుణ వనరు. కీలకమైన ఎన్‌బీఎఫ్‌సీలను ప్రైవేటు రంగ బ్యాంకుల్లో విలీనానికి మార్గం సుగమం చేస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *