మంత్రివర్గ విస్తరణ అనంతరం అసంతృప్తి..రంగంలోకి కేటీఆర్‌

హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరణ అనంతరం అసంతృప్తి గళం వినిపించిన అధికార టీఆర్‌ఎస్‌ నేతలను బుజ్జగించే పని మొదలైంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ అనంతరం పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి ఏకంగా కేసీఆర్‌ మాట తప్పారని ఆరోపించగా.. జోగు రామన్న అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మైనంపల్లి బడ్జెట్‌ సమావేశాలకు హాజరవకపోగా.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి గురవడంతో వారికి కేటీఆర్‌ సర్దిచెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన నేతలకు ఆయన మంగళవారం ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలిసింది. వారి సేవలను సందర్భానికి అనుగుణంగా పార్టీ అధినాయకత్వం తప్పకుండా వినియోగించుకుంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక అవకాశాలు వస్తాయని, తొందరపడొద్దని, ఓపికగా ఉండాలని కేటీఆర్‌ వారిని అనునయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే టి.రాజయ్య, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో ప్రెస్‌మీట్లను ఏర్పాటు చేయించడంతోపాటు పలువురు నేతలు పార్టీకి, అధినేత కేసీఆర్‌కు విధేయత తెలియజేస్తూ ప్రకటనలు విడుదల చేశారని సమాచారం.కేసీఆర్‌ రుణం తీర్చుకుంటా: రాజయ్యఅసెంబ్లీ లాబీల్లో సోమవారం మీడియా ప్రతినినిధులెవరితోనూ తాను మాట్లాడలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య అన్నారు. తాను మాట్లాడినట్టుగా ఆడియో, వీడియో రికార్డులు లేవన్నారు. కేబినెట్‌ విస్తరణలో మాదిగలకు అన్యాయం జరిగిందని తాను వ్యాఖ్యానించలేదని చెప్పారు. ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి పరిమితమైన తాను తెలంగాణ రాజన్నగా గుర్తింపు పొందడానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. మంగళవారంతెలంగాణభవన్‌లో రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి కేబినెట్‌లో తనను ఉప ముఖ్యమంత్రిగా నియమించి కేసీఆర్‌ అసాధారణంగా గౌరవించారని తెలిపారు. తాను వంద శాతం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకునేందుకు తన జీవితాంతం పనిచేస్తానన్నారు. తగిన పదవి ఇచ్చి గౌరవిస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చారని తెలిపారు. కేబినెట్‌లో అందరికీ ఒకేసారి అవకాశాలు రావని రాజయ్య అన్నారు. ప్రతిసారీ ఒకే సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేరని, ఈసారి ఎస్సీల నుంచి కొప్పుల ఈశ్వర్‌కు ఇచ్చారని తెలిపారు. త్వరలో మాదిగలకు ప్రభుత్వంలో కేసీఆర్‌ పెద్దపీట వేస్తారన్న ఆశ ఉందన్నారు. మాదిగలకు మందకృష్ణ మూలపురుషుడేమీ కాదని ఎద్దేవా చేశారు. ఇంకా అజ్ఞాతంలోనే జోగు..మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంపై సర్వత్రా కలకలం రేగగా.. మంగళవారం ఆయన ఆచూకీ తెలియడంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన రామన్న.. సోమవారం ఉదయమే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి గన్‌మెన్లను కూడా వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి పదవి రాకపోవడంతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల నుంచి వచ్చే ఫోన్లకు సమాధానం చెప్పలేకనే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయాల్సి వచ్చిందని ఆయన కుటుంబీకులు, సన్నిహితులు చెబుతున్నారు. రక్తపోటు అధికం కావడంతో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *