మహిళల వంద మీటర్ల పరుగు విభాగంలో ద్యుతీచంద్‌కు స్వర్ణం

దిల్లీ: భారత స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌ మహిళల వంద మీటర్ల పరుగు విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇటలీలోని నేపుల్స్‌లో జరుగుతున్న 30వ వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో మంగళవారం ఆమె ఈ ఘనతను సాధించింది. ఇందులో ఇదే భారత్‌కు మొదటి స్వర్ణం కావడం విశేషం. ఇప్పటి వరకు యూనివర్సిటీ గేమ్స్‌లో 100మీటర్ల విభాగంలో భారత్‌ నుంచి ఎవ్వరూ ఫైనల్స్‌ వరకు చేరుకోలేదు. మన దేశం నుంచి స్వర్ణం సాధించిన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ఫైనల్స్‌లో 11.32 సెకన్ల సమయంలో ఆమె పరుగు పూర్తి చేసింది. ఈ విజయంతో పాటు ద్యుతి గతంలో రెండు ఏషియన్‌ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు కూడా సాధించింది.

ఈ విజయం సాధించిన ఆమెకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ట్విటర్‌లో  అభినందనలు తెలియజేశారు. ఈ ఎడిషన్‌లో మొదటి పతకం సాధించిన నిన్ను చూసి దేశం గర్విస్తోందని కోవింద్ పేర్కొన్నారు. ఈ కృషి ఇలాగే కొనసాగించి ఒలంపిక్స్‌లో ప్రతిభ చాటాలని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆమె ధన్యవాదాలు తెలుపుతూ, ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అందరి ఆశీస్సులతోనే యూనివర్సిటీ గేమ్స్‌లో స్వర్ణం సాధించగలిగానన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్‌లో ఫొటోలు పోస్టు చేస్తూ, తనను ఎంత వెనక్కి లాగితే అంత బలంగా దూసుకువస్తానని ఓ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. స్వలింగ సంపర్కాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలతో ఆమె వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *