ముఖ్యమంత్రి పై తెదేపా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై తెదేపా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. వడ్డీ లేని రుణాల విషయంలో సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. గురువారం అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

ఇవాళ శాసనసభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో  నిమ్మల మాట్లాడుతూ.. ‘‘ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని హేళన చేస్తూ మాట్లాడారు. సభ నుంచి రాజీనామా చేస్తారా అని సవాల్‌ చేశారు. వడ్డీలేని రుణాలు ఎంతమొత్తం ఇచ్చామన్నది రికార్డులతో సహా చూపిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు రద్దు చేశారని అసత్యాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. వడ్డీలేని రుణాల కింద 2013-14లో రూ.349 కోట్లు చెల్లించాం. 2014-15లో రూ.44 కోట్లు చెల్లించాం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.570 కోట్లు పెండింగ్‌లో ఉంది. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఈ నిధులను విడుదల చేయాలని సీఎం జగన్‌ను కోరితే ఆయన నిరాకరించిన విషయం వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు.

వడ్డీలేని రుణాల పథకం రద్దుచేశారని సీఎం అసత్యాలు మాట్లాడారని ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ఎంత మొత్తం ఇచ్చామో లెక్కలతో సహా చూపిస్తామన్నారు. దీనిపై వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి స్పందిస్తూ నిన్న చర్చముగిశాక ఇవాళ కూడా కరవుపై చర్చించాలని తెదేపా సభ్యులు పట్టుబట్టారన్నారు. అయినప్పటికీ చర్చకు సీఎం జగన్‌ ఒప్పుకోవడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు. సీఎంపై వ్యక్తిగత వ్యాఖ్యలు మానుకోవాలని తెదేపా సభ్యులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *