మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరుకు ప్రశంసలు

మెదక్‌: సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రి, అక్కడ పని చేసే సిబ్బంది అనగానే ఎవరూ పట్టించుకోరనే అపప్రద ప్రజల్లో ఉంటుంది. కానీ, మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఝార్ఖండ్‌కు చెందిన ప్యారీలాల్‌, ఆయన భార్య మహతీదేవి మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయ పల్లిలో నివాసముంటూ ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నారు.గర్భిణి అయిన మహతీదేవి తూప్రాన్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటోంది. ఎప్పటిలాగే పరీక్షల కోసం ఆస్పత్రికి బయలుదేరింది. దండుపల్లి వరకు ఆటోలో చేరుకున్న దంపతులు అక్కడి నుంచి మరో ఆటోలో ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆస్పత్రి ఆవరణకు 100 మీటర్ల దూరంలో డ్రైవర్‌ దింపేశాడు. 10 మీటర్లు నడిచేలోపే మహతిదేవికి పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే గమనించిన ఆస్పత్రి సిబ్బంది ప్రసవానికి సంబంధించిన కిట్లతో అక్కడికి చేరుకున్నారు. ఆమె అక్కడే ప్రసవించగా స్ట్రెచర్‌పై ఆస్పత్రిలోపలికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డని పరీక్షించి వారిద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్యారీలాల్‌, మహతీదేవికి ఇప్పటికే ఏడుగురు సంతానముండగా.. పాపతో కలిపి 8కి చేరింది. వీరిలో ముగ్గురు బాలురు, ఐదుగురు బాలికలున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలని అడిగితే ప్యారీలాల్‌ నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. వాళ్ల ఊళ్లో ఒకరికి 18 మంది సంతానమున్నారని, తనకూ అధిక సంతానం కావాలని ప్యారీలాల్‌ అంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *