మేమూ రాముడి వంశస్థులమే..మేవర్‌-ఉదయ్‌పూర్‌ రాజ కుటుంబం వెల్లడి

ఉదయ్‌పూర్‌: శ్రీరాముడి కుమారుడైన కుశుడి వంశానికి చెందినవారమంటూ జైపుర్‌ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి పేర్కొన్న మరుసటి రోజే మరో రాజకుటుంబం తాము రాముడి వంశస్థులమంటూ బయటకు వచ్చింది. మేవర్‌-ఉదయ్‌పూర్‌ రాజకుటుంబానికి చెందిన మహేంద్రసింగ్‌ కూడా తాము రాముడి కుటుంబానికి చెందినవారమంటూ ప్రకటించారు. 

‘శ్రీరాముడి వంశానికి చెందిన వారసులెవరైనా ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయం మీడియా ద్వారా తెలిసింది. మేం రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందినవారం. లవుడి పూర్వీకులు తొలుత గుజరాత్‌లో ఉండేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి అహద్‌(మేవర్‌)కు వచ్చారు. అక్కడ శిసోడియా వంశాన్ని ఏర్పాటుచేశారు. తొలుత వారి రాజధాని చిత్తోర్‌. తర్వాతి క్రమంలో దాన్ని ఉదయ్‌పూర్‌కు మార్చారు. అవసరమైతే ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను, దస్త్రాలను కోర్టుకు అందజేస్తాం’ అని మహేంద్రసింగ్‌ తెలిపారు. 

భాజపా ఎంపీ, జైపుర్‌ రాజకుమారి దియా కుమారి కూడా తాము కుశుడి వంశస్థులమంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయోధ్య కేసు విచారణ సమయంలో శ్రీరాముడి ‘రఘువంశానికి’ చెందిన వారసులెవరైనా నేటికీ అయోధ్యలో నివసిస్తున్నారా అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు ఆమె స్పందించారు. తమ కుటుంబం వద్ద ఉన్న పురాతన రాత ప్రతులు, వంశవృక్షం వివరాలు, పత్రాల ఆధారంగానే ఇలా చెప్పగలిగానని దియాకుమారి వెల్లడించారు. శ్రీరాముడి వంశస్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *