యు ముంబాపై బంగాల్‌ వారియర్స్‌దే పైచేయి

ఆద్యంతం ఆధిపత్యం చేతులు మారుతూ.. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగాల్‌ వారియర్స్‌ పైచేయి సాధించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన పోరులో వారియర్స్‌ 32-30 తేడాతో యు ముంబాపై గెలిచింది. రైడింగ్‌లో ప్రపంజన్‌ (6), మణిందర్‌ సింగ్‌ (5).. ట్యాక్లింగ్‌లో బల్‌దేవ్‌ సింగ్‌ (5), జీవ కుమార్‌ (4) రాణించి బంగాల్‌కు విజయాన్ని అందించారు. ముంబా తరపున అర్జున్‌ పది రైడ్‌ పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది.  తొలి అర్ధభాగాన్ని ముంబా 16-11తో ముగించింది. విరామం తర్వాత అసలైన పోరు మొదలైంది. ప్రపంజన్‌ ఒకే రైడ్‌లో మూడు పాయింట్లు తెచ్చి ముంబా ఆలౌట్‌కు కారణమయ్యాడు. దాంతో బంగాల్‌ 18-17తో తొలిసారిగా ఆధిక్యం సంపాదించింది. కానీ అర్జున్‌ తిరిగి పంజా విసరడంతో ముంబా మరోసారి బంగాల్‌ను ఆలౌట్‌ చేసి 26-20తో ఆధిపత్యం ప్రదర్శించింది. అదే దూకుడు కొనసాగించి ఉంటే ముంబా గెలిచేదే. కీలక సమయాల్లో అనవసరమైన తప్పిదాలు చేసిన ఆ జట్టు ప్రత్యర్థికి కోలుకునే అవకాశమిచ్చింది. మరో నాలుగు నిమిషాల ఆట మిగిలి ఉందనగా స్కోరు 27-27తో సమమైంది. అప్పుడే ముంబాను ఆలౌట్‌ చేసిన బంగాల్‌ 31-28తో విజయం దిశగా సాగింది. చివరి రైడ్‌కు ముందు 31-30తో నిలిచిన బంగాల్‌.. అర్జున్‌ను పట్టేసి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 41-20తో యూపీ యోధను చిత్తుచేసి ఎట్టకేలకు సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లోనైనా విజయం నమోదు చేసింది. రైడింగ్‌లో కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ (12) అద్భుత ప్రదర్శనతో జట్టును తిరిగి విజయాల బాట పట్టించాడు. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆ జట్టుకిదే తొలి గెలుపు. ట్యాక్లింగ్‌లో నీరజ్‌ కుమార్‌ (8) సత్తాచాటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *