యూఎస్‌ ఓపెన్‌: ఫైనల్లో ప్రవేశించిన నాదల్‌

న్యూయార్క్‌: ఊహించినట్లుగానే స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో నాదల్‌ 7-6(8/6), 6-4, 6-1 తేడాతో  బెర్రెట్టినీ(ఇటలీ)పై గెలిచి ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చివరకు నాదల్‌ పైచేయి సాధించి తుది పోరుకు అర్హత సాధించాడు. నాదల్‌- బెర్రెట్టినీల మధ్య జరిగిన తొలి సెట్‌ రసవత్తరంగా సాగింది. ఇద్దరు సమంగా తలపడటంతో ఆ సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే ఇక్కడ కూడా ఆసక్తికర సమరమే జరిగింగి. కాకపోతే చివరకు నాదల్‌ గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి సెట్‌ను గెలిచిన ఊపును రెండు, మూడు సెట్లలో నాదల్‌ కొనసాగించాడు.

అయితే బెర్రిట్టినీ మాత్రం అద్భుతమైన ఏస్‌లతో ఆకట్టుకున్నాడు. రెండో సెట్‌ను నాదల్‌ 6-4తో గెలవగా, మూడో సెట్‌ను 6-1తో దక్కించుకోవడంతో ఫైనల్లోకి ప్రవేశించాడు.  ఫలితంతా 19వ గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌పై నాదల్‌ గురిపెట్టాడు. ఇప్పటివరకూ 18 గ్రాండ్‌ స్లామ్‌లు సాధించిన నాదల్‌.. యూఎస్‌ ఓపెన్‌ను మాత్రం మూడు సార్లు మాత్రమే అందుకున్నాడు. 2017లో చివరిసారి యూఎస్‌ ఓపెన్‌ను గెలిచిన నాదల్‌.. ఈసారి కూడా టైటిల్‌పై ధీమాగా ఉన్నాడు. టాప్‌  సీడ్‌ ఆటగాళ్లు రోజర్‌ ఫెడరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌లు ఇప్పటికే ఇంటి ముఖం పట్టడంతో  నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ను సాధించడం కష్టం కాకపోవచ్చు. సోమవారం జరుగనున్న అంతిమ సమరంలో మెద్విదేవ్‌తో నాదల్‌ తలపడనున్నాడు. మెద్విదేవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *