రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా బొమ్మ పెట్టరా?: భట్టి

హైదరాబాద్‌: ‘‘చరిత్రను చూపడం కోసమే యాదాద్రి దేవాలయంలో సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ గుర్తయిన కారు బొమ్మలను చెక్కుతున్నారని అంటున్నారు.. ఏమిటి ఆయనకున్న చరిత్ర?’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. యాదాద్రి ఆలయ స్తంబాలపై కేసీఆర్‌, కారు బొమ్మలను చెక్కడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్‌ తనను తాను రాజుగా భావిస్తూ.. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో ఏ రకమైన ఫ్యూడల్‌ వ్యవస్థ ఉందో.. దాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా హాల్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావు లేదని, ఒకవేళ పాలకులుగా గొప్ప పనులు చేశారని చెక్కించుకోవాలనుకుంటే ఆయన కంటే గొప్పవారు చాలా మంది ఉన్నారన్నా రు. ఆలయంలో బొమ్మలు చెక్కించాల్సి వస్తే సాయుధ రైతాంగ పోరాట యోధుల బొమ్మలను, టెనెన్సీ చట్టాన్ని తెచ్చి.. రైతులకు వారి భూములపై హక్కు కల్పించిన అప్పటి సీఎం బూర్గుల బొమ్మను, బొందుగుల నర్సింగరావు బొమ్మను, భూసంస్కరణలను అమలు చేసిన పీవీ బొమ్మ ను, చిన్నరాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగంలో అవకాశం కల్పించిన బీఆర్‌ అంబేడ్కర్‌ బొమ్మను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా బొమ్మను చెక్కించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *