వరవరరావుకు మెరుగైన వైద్యం కల్పించండి.. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు ఆయన సతీమణి లేఖ

ఖైరతాబాద్‌: తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసిన వరవరరావుకు జైలులో మెరుగైన సదుపాయాలు కల్పించాలని వివిధ రంగాల ప్రముఖులు కోరారు. ఇదే విషయమై ఆయన సతీమణి పి.హేమలత మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు లేఖ రాశారు. ఆ లేఖను శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో హేమలతతో కలిసి సామాజిక ఉద్యమకారులు ప్రొ.జి.హరగోపాల్‌, వసంత కన్నాభిరాన్‌, సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు. హేమలత మాట్లాడుతూ.. భీమాకోరేగావ్‌ కేసులో అరెస్టైన తొమ్మిది మంది నెలల కిందట గవర్నర్‌కు లేఖ రాసినా స్పందించలేదన్నారు. వరవరరావు వయసు రీత్యా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ప్రొ.హరగోపాల్‌ మాట్లాడుతూ.. అరెస్ట్‌ అయిన తొమ్మిది మంది ప్రజాస్వామిక వాదులని, వారు గవర్నర్‌కు రాసిన లేఖలో ఎక్కడా వారి డిమాండ్లు ప్రస్తావించలేదని, ఆ లేఖకు స్పందించాల్సిన బాధ్యత గవర్నర్‌, మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. పొత్తూరి మాట్లాడుతూ.. వెంటపడి నిర్బంధిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. వసంత కన్నాభిరాన్‌ మాట్లాడుతూ.. అన్యాయాన్ని ప్రశ్నించేవారిని అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో జైల్లో పెడుతున్నారన్నారు. కవి కె.శివారెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి దేవులపల్లి అమర్‌, సీనియర్‌ పాత్రికేయులు పాశం యాదగిరి  మాట్లాడారు. సమావేశానికి భల్లా రవీందర్‌ అధ్యక్షత వహించగా సీనియర్‌ పాత్రికేయులు పద్మజాషా, కె.లలిత,  ఆచార్య డి.నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *