వైద్య ఆరోగ్య శాఖతో ఆర్ఎంసీఏఎన్ఏ ఎంవోయూ

అమరావతి, సెప్టెంబర్ 23: రంగరాయ మెడికల్ కాలేజ్ అల్ముని ఆఫ్ నార్త్ అమెరికా (Rangaraya Medical College Alumni North America)తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) సమక్షంలో ఈ మేరకు ఎంవోయూ కుదిరింది. రంగరాయ మెడికల్ కాలేజ్ అల్ముని ఆఫ్ నార్త్ అమెరికా (RMCANA)తో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ క్యాంపస్ లో మాతాశిశు ఆరోగ్య కేంద్రం 2,3,4 ఫ్లోర్ ల నిర్మాణానికి మంత్రి ఆళ్ల నాని ఛాంబర్ లో వైద్యఆరోగ్యశాఖతో ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. దాదాపు రూ.20 కోట్లతో నిర్మించే ఈ మూడు ఫోర్లను 2020 డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నట్లు ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో జీ ఫ్లస్ 1 నిర్మాణం దాదాపు పూర్తయింది. దీన్ని నిర్మించేందుకు గతంలోనే ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. 20 కోట్ల రూపాయలతో ఈ కేంద్రం గ్రౌండ్ మరియు మొదటి అంతస్థు నిర్మాణానికి గతంలో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.14.60 కోట్లు సివిల్ పనులకు, అలాగే రూ.5.40 కోట్లు పరికరాల కోసం కేటాయించగా, గ్రౌండ్ మరియు మొదటి అంతస్థులో కొంత భాగం నిర్మాణం పూర్తయింది. ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతిపాదనలో భాగంగా 2,3,4 అంతస్థుల నిర్మాణానికి తాజాగా ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. అందులో భాగంగా ఈ కేంద్రంలో జీ ఫ్లస్ 4తో నిర్మించే ప్రసూతి, చిన్నారుల పడకలు, ఎన్ఐసీయూ, ఫ్యాకల్టీ రూమ్ లు, కాన్ఫరెన్స్ హాల్ లు నిర్మిస్తారు.

కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. కేఎస్ జవహార్ రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఎంఈ డాక్టర్ వెంకటేష్, ఆర్ఎంసీఏఎన్ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఏవీ సుబ్బారాయ చౌదరి, ముఖ్య దాత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ మరియు ఓ.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *