శ్రీరాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు

నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ‘పునరుజ్జీవ కల’ త్వరలోనే సాకారం కాబోతోంది. 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు గల శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో కాళేశ్వరం నీటిని తీసుకొస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏమిటీ పథకం..
కాళేశ్వరం జలాలను రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఏటా 60 టీఎంసీలు శ్రీరాంసాగర్‌లోకి తరలించాలనేది పునరుజ్జీవ పథకం లక్ష్యం. ఇందుకోసం మూడుచోట్ల పంపుహౌస్‌లు నిర్మించారు. వీటిల్లో ఒక్కోటి 6.5 మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిదేసి మోటార్లు బిగిస్తున్నారు.

వారం రోజుల్లో జలాలు..
ముప్కాల్‌ పంపుహౌస్‌ పూర్తవనప్పటికీ రాంపూర్‌, రాజేశ్వరరావుపేట పంపుహౌస్‌లు నడిస్తే రివర్స్‌ గ్రావిటీ ద్వారా 54 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు కాగా.. 54 టీఎంసీలు గ్రావిటీ ద్వారా తరలించొచ్చని పేర్కొంటున్నారు. ‘0’ పాయింట్‌ వద్ద
పంపుహౌస్‌ పూర్తయితే ఇక్కడి రెగ్యులేటరీ గేట్లు మూసి పక్క నుంచి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇది అక్టోబరు తర్వాతే అంటున్నారు.

ప్రస్తుతం అర టీఎంసీనే..
ఎనిమిదో ప్యాకేజీ అయిన లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌ నుంచి రెండు టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఎనిమిది మోటార్లతో 24 గంటలు పంపింగ్‌ చేస్తే ఒక టీఎంసీని తీసుకురాగలమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు పంపుహౌస్‌ల్లో నాలుగేసి మోటార్లతో పంపింగ్‌ జరగనుండటంతో అర టీఎంసీనే తీసుకోగలమని అధికారులు చెబుతున్నారు.

ప్రారంభానికి సీఎం రాక..
రెండు పంపుహౌస్‌లు పూర్తయి ఎస్సారెస్పీ వరకు నీటిని తీసుకెళ్లే వెసులుబాటు ఉండటంతో పథకం ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో పదో తేదీనే కార్యక్రమం నిర్వహించాలని భావించినా.. వర్షాలతో పంపుహౌస్‌ల వద్ద కొంత అసౌకర్యం ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 15వ తేదీలోపు ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *