హోంమంత్రే అలా మాట్లాడితే ఎలా? – చంద్రబాబు

అమరావతి: దేవుడు, ప్రజల ఆశీస్సుల వల్లే అలిపిరి దాడిలో మృత్యువు నుంచి బయట పడ్డానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. తన భద్రత కుదింపుపై మాట్లాడుతూ ప్రజలే తనకు రక్షకులని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి భద్రత, రక్షణ బాధ్యతా ప్రభుత్వానిదేనని చెప్పారు. గత ఐదు వారాలుగా రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు పెరగడం బాధాకరమని.. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటే రాష్ట్రాభివృద్ధికి తాను చేసిన కృషి అంతా బూడిద పాలవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.  రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు. సాక్షాత్తూ హోంమంత్రే ‘ఎన్నో జరుగుతుంటాయి. అన్నింటికీ కాపలా ఉంటామా?’ అంటే సామాన్యుడికి రక్షణగా ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెట్టుబడులకు ఆస్కారముంటుందన్నారు.

చంద్రబాబు నివాసముంటున్న ఇంటికి సీఆర్డీయే అధికారులు నోటీసులు ఇచ్చిన అంశంపైనా నేతలు చర్చించారు. ఆ ఇంటికి యజమాని వేరొకరైనా తమ అధినేతను ఖాళీ చేయించడమే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ సమావేశానికి ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ సభాపతి కోడెల, మాజీ మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, సుజయ కృష్ణరంగారావు, కాలవ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు తెదేపా కార్యకర్తలు, మహిళలు ఆయన నివాసానికి తరలివచ్చారు. చంద్రబాబు భద్రత గురించి మహిళలు ఆందోళన వ్యక్తం చేయగా.. మీరంతా భద్రతగా ఉన్నప్పుడు దేనికీ భయపడనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *