2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌!

లండన్‌: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌ మైక్‌ గాట్టింగ్‌ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా సమాఖ్యలను పర్యవేక్షించే వాడా (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్‌ ఆంటీ డోపింగ్‌ ఏజెన్సీ) పరిధిలోకి ఇటీవలే బీసీసీఐ చేరింది. దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయిందని ఆయన తెలిపాడు.

ఓ క్రీడా ఛానెల్‌ పేర్కొన్న వివరాల ప్రకారం.. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకు తగిన కార్యాచరణ ప్రారంభించామని ఐసీసీ కొత్త ముఖ్య కార్యదర్శి మనుసావ్నే ఎంసీసీ కమిటీతో అన్నాడని గాట్టింగ్‌ పేర్కొన్నాడు. అయితే ఈ ఆటలు నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాడు. అన్ని పురుష జట్లతో పాటు మహిళల జట్లూ ఇందులో పాల్గొంటాయని వివరించాడు. కాగా, క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో జతచేయాలనే అంశం ఇప్పటికే పలుసార్లు చర్చకు కూడా వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ సైతం ఈ విషయానికి మద్దతు తెలిపాడు. ఇటీవలే మహిళల క్రికెట్‌ను 2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ప్రవేశపెట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *