రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలి … నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం దసరా పండగ సందర్భంగా ఉచితంగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన వనపర్తిలోని ఐదవ వార్డు లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సుఖ సంతోషాలతో ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలన వల్ల ప్రజలకు మేలు జరగాలన్నది తమ అభిమతమని అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం లక్ష యాభై రెండు వేల చీరలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం పంపిణీ చేస్తున్న చీరలలో వీలైనన్ని ఎక్కువ రంగులు, డిజైన్లు ఉన్నాయని, మహిళలు ఆ చీరలను ధరించి బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
వచ్చే ఖరీఫ్ నాటికి ఈదుల చెరువు కు కూడా సాగునీరు తీసుకువచ్చి పంటలకు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. D8 కాలువ ద్వారా మేజర్ కాలువ త్రీ నుండి నీరు అందిస్తామని, అప్పాయిపల్లి నుండి శ్రీనివాస పూర్ గుట్ట లలోని అటవీ ప్రాంతం వరకు ఈ నీరు వస్తాయని మంత్రి వెల్లడించారు.


జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండగ పెద్ద పండగ అని, ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి తిరిగి అత్తవారింటికి వెళ్లేటప్పుడు సంప్రదాయం ప్రకారం చీర , సారే పెట్టడం తెలుగువారి సంప్రదాయ మని, అందులో భాగంగానే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వివిధ రంగులతోపాటు, మంచి మంచి డిజైన్లు ఉన్నాయని, మహిళలు వీటిని సద్వినియోగం చేసుకొని దసరా పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని, బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, డి.ఎస్.ఒ రేవతి, పౌరసరఫరాల డిఎం లక్ష్మయ్య, ఆర్డిఓ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *